కే ఎన్ వై పతంజలి గారి 'మోటుమనిషి '

Harshaneeyam - Podcast készítő Harshaneeyam

Podcast artwork

Kategóriák:

"సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు" - సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు కె ఎన్ వై పతంజలి .హర్షణీయానికి స్వాగతం.ఇప్పుడు పరిచయం చేయబోతున్న కథ పేరు 'మోటుమనిషి'.ఈ కథను హర్షణీయం ద్వారా పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన శ్రీమతి ప్రమీల పతంజలి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.పతంజలి గారి సాహిత్యం , మీరు కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే పేజీ లో ఇవ్వబడ్డాయి.పతంజలి గారు , అనేక కథలూ నవలలూ రాయడమే గాక, మూడు దశాబ్దాలకు పైగా పత్రికారంగానికి కూడా తన సేవలను అందించారు.తెలుగు కథ ను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిన కే ఎన్ వై పతంజలి గారి గురించి, ఆయన చిరకాల మిత్రులు , సుప్రసిద్ధ రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు ఏమంటారంటే'' రచయిత అయినవాడు తన ఆవరణంలోంచి ఎదిగి మరో ఆవరణం నుంచి జీవితాన్ని దర్శించగలగాలి. అట్లా దర్శించగలిగిన వాళ్లు గొప్ప రచయితలుగా మిగిలిపోతారు. ఒక సంకుచితమైన పరిమితిని విధించుకుని చేసే రచనలకీ వార్తా కథనాలకీ పెద్ద తేడా ఉండదు. ప్రపంచ సాహిత్యంలో గొప్ప వనుకుంటున్న రచనలన్నీ సమకాలీనతని జీర్ణించుకుంటూనే దాన్ని అధిగమించినవే. పతంజలి రచనలు ఆ కోవలోకి వస్తాయి.మంచి రచనకీ గొప్ప రచనకీ ఉండే మౌలికమైన భేదం అదే. పూర్తిస్థానీయత, సమకాలీనత రచయితకి సంకెళ్లు కాకూడదు. గొప్ప రచన అనేక పొరలుగా, అనేక స్థాయిలలో పాఠకుడికి చేరువవుతుంది. అట్లా ఎప్పుడు ఏ కాలంలో చదివినా పాఠకుడు ఆ రచనలో రిలేట్ అవుతాడు. అటువంటి రచనలు ఉత్తమ సృజనాత్మకతకి ఉ దాహరణలు..."మోటుమనిషి అతని వయసు నా వయసుచేత రెండుసార్లు భాగారింపబడుతుంది. అతని ఒళ్లు కూడా నా సైజు ఇద్దరు మనుషులకు సరిపడా ఉంది. అతను వ్యవసాయదారుడే అయిన పక్షంలో, పొలానికి సరిపడే ఎరువు అతని ఒంటినే ఉంది.కాని, వెధవకి బుద్దే ఉన్నట్టు లేదు. ఖచ్చితంగా చెప్పగలను. లేదు. ఉంటే నేనతన్ని మర్యాదగానే - "మీరు నా సీట్లోకి వచ్చేస్తారా - నా కా కిటికీ పక్క చోటిచ్చేసి?” అనడిగినప్పుడు - “రాను... నాను సుట్ట కాల్చుకోవాలి” అని నిర్మొహమాటంగా చెప్పడు.'వీణ్ణి చుట్ట కాల్చుకోనివ్వకూడదు.” గట్టిగా నిశ్చయించుకున్నాను. బస్సు వేగంగా పోతూంది. గాలికి కామోసు అతని తలమాత్రం కొంచెం కదులుతూంది. జిడ్డు తల.అరచేతులంతేసి చెవులు. వాటికి స్కూటర్ చక్రాలంతేసి తమ్మెట్లు. వాటికి మురికి పూసుకున్న ఎరుపూ, తెలుపూ పొళ్లు.బుద్ది లేకపోయిన తరువాత ఇంకా ఏమేం ఉంటే మాత్రం ఏమిటి లాభం ? అసలు ఉదయం లేచిన దగ్గరి నుంచి తల నొప్పిగా ఉంది. దరిద్రపు తలనొప్పి, తెలుగు సినిమాలాగన్నా వచ్చిన వెంటనే తిరిగిపోదు. నిద్రలేచి మంచంమీద నుంచి కాళ్లు కింద మోపేసరికి, పనిలేని పెళ్లాం లాగ, పనున్న స్నేహితుడిలాగ వచ్చేసి నెత్తికెక్కి కూర్చుంది దిక్కుమాలిన తలనొప్పి.మళ్లీ పక్కన కూర్చున్న నాయుడికేసి చూశాను. అతను కిటికీలోంచి కనబడుతూన్న చెట్లకేసీ, చేమలకేసీ కాబోలు దీక్షగా చూస్తున్నాడు. వీడి దృష్టి తగిలితే అవి చటుక్కున చచ్చి ఊరుకుంటాయి.వీడు ఎంతకీ చుట్ట కాల్చటానికి ప్రయత్నించటం లేదు. ఇలా వాడు చుట్ట తీసి ముట్టించ ప్రయత్నించడం, నేనిలా మొదట ఇంగ్లీషులోనూ తరువాత తెలుగులోనూ అభ్యంతరం చెప్పి పగ తీర్చుకోవడం - ఈ పూటకి సరదా తీరేలా లేదు.కిటికీ పక్క సీటయితే ఓ చేయి కిటికీ చువ్వల మీద ఆన్చి, రెండో చేయి ఎదుటి సీటు తాలూకు చట్రం మీద ఆన్చి, చేతుల మీద తలాన్చుకుని పడుకోవచ్చు - ముఖ్యంగా ఇలా తలనొప్పిగా ఉన్న సమయాల్లో,కానీ, ఈ భారతదేశపు హృదయాలయిన పల్లెటూరి తాలూకు పౌరుడు, రాతి గుండెవాడు. ఎక్కడ దిగిపోయి నన్ను సంతోష శిఖరాల మీదికి ఎక్కిస్తాడో? “ఎక్కడ దిగుతారు?” అడిగాను. అతను నాకేసి పరీక్షగా చూశాడు. “సోడారం.” చచ్చాం .వీడు నన్ను చివరివరకూ వదలడు. “మందే ఊరు?” నాయుడడిగాడు నన్ను.నా ఎడమచేతి పక్కకి చూశాను. ఓ ముఫ్ఫై ఏళ్ళ వయసున్న టెరిలిన్ బట్టల ఆసామీ వీక్లీ ఒకటి మధ్యకి మడత పెట్టి చదువుతున్నాడు.“ఎక్కడి కెళ్తన్నావు?” నాయుడే మళ్లీ అడిగాడు.గొంతు తగ్గించి, “వెస్ట్ జర్మనీ” అన్నాను నెమ్మదిగా. నాయుడికి అర్థమయినట్టు లేదు. “అదెక్కడ?” ఆశ్చర్యంగా అడిగాడు.“చోడవరానికి ఇంకా అవతలుందిలే” అన్నాను.“చోడారంలో ఈ బస్సాగిపోద్ది. ఆ మీదికెళ్ళదు.” నాయుడు ముతకగా నవ్వాడు.“చోడవరంలో దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చులే.” విసుగ్గా అన్నాను.దెబ్బతో నోరు మూసుకున్నాడు.బస్సు ఆగింది. చిన్నాపురం జంక్షన్. ఇద్దరో ముగ్గురో దిగి, ఆరుగురనుకున్నాను కానీ - ఏడుగురెక్కారు.లాభం లేదు. నాకు తెలియకుండానే ఏయే ఊర్లలో...

Visit the podcast's native language site